కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలకు కేంద్రమంత్రి, కర్ణాటక రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. 104 ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఒక్క స్వతంత్ర ఎమ్మెల్యేను కమలనాథులు కాపాడుకోలేక పోయారు. బుధవారం ఉదయం యడ్యూరప్ప శిబిరంలో కనిపించిన ఆ ఎమ్మెల్యే మధ్యాహ్నానికి కాంగ్రెస్ పంచన చేరిపోయారు.
కాగా, 104 మంది సభ్యులు కలిగిన బీజేపీ గురువారం ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 8 మంది సభ్యుల మద్దతు అవసరం. మరోవైపు, కాంగ్రెస్ (78), జేడీఎస్ (38)ల కూటమికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ కూటమి బలం 118గా ఉంది. అయినప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీకి అవకాశం ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు.