గడిచిన 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నట్లు ఆయన సతీమణి సునీత వెల్లడించారు. విపక్ష కూటమి ఆదివారం ఢిల్లీలో చేపట్టిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆమె.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.
విద్య, వైద్యంతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని.. విపక్ష కూటమికి అవకాశం కల్పిస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. భారతమాత ఇబ్బందుల్లో ఉందని, ఈ దౌర్జన్యం పనిచేయదని సునీత అన్నారు. తన భర్తకు దేశవ్యాప్తంగా ఎంతో మద్దతు లభిస్తోందన్నారు.
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో భావోద్వేగ ప్రసంగం చేసిన సునీత.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రజలు కేజ్రీవాల్‌తోనే ఉన్నారని, ఆయన్ను ఎప్పటికీ జైళ్లోనే ఉంచలేరన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పంపిన సందేశంలోని ఆరు గ్యారంటీలను వెల్లడించారు.
'దేశవ్యాప్తంగా కరెంటు కోతలు ఉండవు. పేదలకు ఉచిత విద్యుత్తు అమలు. సమాజంలోని అన్ని వర్గాల వారి కోసం నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి గ్రామంలో మంచి పాఠశాల. ప్రతి గ్రామంలోనూ మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. స్వామినాథన్ నివేదిక ఆధారంగా రైతుల పంటలకు కనీస మద్దతు ధర. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం' అని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని చెప్పారు.