కేరళ: బేసిక్ పే రూ.23 వేలు.. గరిష్ట వేతనం రూ.1.66లక్షలు

శుక్రవారం, 29 జనవరి 2021 (20:11 IST)
కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస బేసిక్ పే రూ.23,000గానూ, గరిష్ఠ వేతనం రూ.1.66 లక్షలుగానూ 11వ వేతన సవరణ కమిషన్ నిర్ణయించింది. కే మోహన్ దాస్ నేతృత్వంలోని కమిషన్ శుక్రవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌లకు ఈ సిఫారసులను సమర్పించింది. సవరించిన వేతనాలు 2019 జూలై 1 నుంచి వర్తిస్తాయి.
 
ఇంటి అద్దె అలవెన్స్ కనీసం రూ.1,200, గరిష్ఠంగా రూ.10,000 చెల్లించాలని సిఫారసు చేసింది. విలేజ్ ఆఫీసర్స్‌కు రూ.1,500 ప్రత్యేక భత్యం చెల్లించాలని పేర్కొంది. ఆరోగ్య శాఖలోని పారామెడికల్ సిబ్బందికి జీతాలను ఏకీకృతం చేయాలని పేర్కొంది.
 
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ కమిషన్ ఎటువంటి సిఫారసు చేయలేదు. అయితే ఈ ఏడాది పదవీ విరమణ చేయబోతున్న సుమారు 20 వేల మంది ఉద్యోగులకు పదవీ కాలాన్ని ఒక ఏడాదిపాటు పెంచాలని సిఫారసు చేసింది. 
 
వేతన సవరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.4,810 కోట్ల భారం పడుతుంది. పెన్షన్ గ్రాట్యుయిటీ ఫండ్‌ పరిమితిని రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. 80 ఏళ్ల వయస్కులైన పింఛనుదారులకు అదనంగా రూ.1,000 చెల్లించాలని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు