కేరళకు చెందిన రాహుల్, కార్తీక అనే యువతీయువకులు ఈ నెల 10వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహానికి ముందు తమ పెళ్లికి రావాలని విజ్ఞప్తి చేస్తూ వారు భారత ఆర్మీని ఆహ్వానించింది. తమ పెండ్లి పత్రికను ఆర్మీకి పంపించింది. ఇందులో...
"ప్రియమైన హీరోలకు..." అంటూ సైనికులను సంబోధిస్తూ, మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధి నిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయామని ఆ జంట పేర్కొంది.
"సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్ళికి హాజరై మమ్మల్ని దీవించండి" అంటూ ఆ జంట పంపిన ఆహ్వాన పత్రికలో పేర్కొంది.
కాగా, ఈ వివాహ ఆహ్వాన పత్రికపై ఇండియన్ ఆర్మీ అధికారులు స్పందించారు. పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు. భారత సైన్యం మీ జంటకు ఆశీస్సులు తెలియజేస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తుంది" అని అధికారులు రిప్లై ఇచ్చారు.