శబరిమలలో హై టెన్షన్.. మహిళలు ప్రవేశిస్తే శుద్ధి చేయలేం..

బుధవారం, 17 అక్టోబరు 2018 (10:53 IST)
శబరిమలలో మహిళల ప్రవేశం బుధవారమే జరుగనుంది. శబరిమలలో మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నెలవారీ పూజలు చేసే క్రమంలో ఆలయ ద్వారాలను తెరవనున్నారు. సాధారణంగా ప్రతి నెల ఐదు రోజుల పాటు భక్తులకు అయ్యప్ప దర్శనం ఉంటుంది. 
 
మరోవైపు, ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే పలువురు మహిళలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తారా? అనే ప్రశ్న ప్రస్తుతం అయ్యప్ప భక్తులను కలవరపెడుతోంది. శబరిమల ఆలయంలోకి పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు అనుమతి వుండదు... పొరపాటున తెలియక ఎవరైనా ఆలయంలోకి ప్రవేశిస్తే.. ఆలయ సంప్రదాయాలను అనుసరించి పుణ్యాహవచనం (ఆలయ శుద్ధి) చేస్తారు. 
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళలను అనుమతిస్తే... ప్రతిరోజు అనేకసార్లు ఆలయాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి ఇలా చేయడం అసాధ్యం. దీంతో, ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలనే ఆలోచనలో ప్రధాన పూజారి, రాజకుటుంబం ఉన్నాయని పందళం రాజకుటుంబ ప్రతినిధి శశికుమార్ వర్మ తెలిపారు. దీనికితోడు ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే.. పూజ నిర్వహించకుండా నిరసన తెలిపేందుకు ప్రధాన పూజారి కందరారు మహేశ్వరారు సిద్ధమయ్యారని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో శబరిమలకు వచ్చే వాహనాలను నిలిపి ఉంచే నీలక్కల్‌‌కు ఇప్పటికే వేలాది మంది ఆందోళనకారులు చేరుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక్క మహిళను కూడా శబరిమల వైపు వెళ్లనిచ్చేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. 
 
ఎవరైనా వస్తే, తాము రోడ్డుపై పడుకుని అడ్డుకుంటామని, అప్పటికీ వెనుదిరగకపోతే వారిని రెండు ముక్కలు చేస్తామని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే.. పూజలు చేయబోమని పూజారులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు