శబరిమల ఆలయంలోకి వెళ్లాలని చూస్తే భౌతికదాడులే.. శివసేన వార్నింగ్

మంగళవారం, 16 అక్టోబరు 2018 (19:34 IST)
శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రం బుధవారం తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం ఈ ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు సిద్ధమయ్యారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో భౌతికదాడులు తప్పవని కొంతమంది హెచ్చరిస్తే, శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన కార్యకర్తలు బెదిరించారు. దీంతో శబరిమల ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
మరోవైపు, సుప్రీంకోర్టు తుదితీర్పు మేరకు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే, ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లనుచేసింది. కానీ, ఆలయం వద్ద నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 
 
మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆలయం వద్ద భారీ ర్యాలీ శివసేన కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. ఆలయం విషయంలో ప్రతిష్టంభన తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కేరళ బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్తత పెరిగింది.
 
ఇంకోవైపు, శబరిమల వివాదాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోగా పరిష్కరించకుంటే ప్రతీ గ్రామం నుంచి జనాలను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు. 10 నుంచి 50 ఏళ్ల బాలికలు, మహిళలను అయ్యప్పస్వామి ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయాన్ని నెలవారి పూజల కోసం తెరవనున్నారు. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న భయం సర్వత్రా నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు