క్రిమినల్ కేసులు.. ఖుష్బూ పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవచ్చు: కోర్టు

గురువారం, 2 మార్చి 2017 (09:50 IST)
సినీ నటి ఖుష్బూకు క్రిమినల్ కేసులో ఊరట లభించింది. ఖుష్బూ తన పాస్‌పోర్టును రెన్యువల్ చేయాల్సిందిగా ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారి ఆమెపై పలు క్రిమినల్ కేసులున్నాయని కారణం చూపి అభ్యర్థనను తిరస్కరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ నటి ఖుష్బూ తరపున మదురై హైకోర్టు శాఖలో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తి రాజేంద్రన్ విచారణకు స్వీకరించారు. 
 
ఇరు తరపు న్యాయవాదుల వాదన అనంతరం న్యాయమూర్తి ఖుష్బూ పాస్‌పోర్టును రెన్యువల్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఖుష్బూ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న కారణంగా 1993 విదేశీ వ్యవహారాల శాఖ జారీ చేసిన జీవో ప్రకారం నిబంధనలతో పాస్ పోర్టు జారీ చేయాలని ఆదేశించారు. ఇంకా పాస్‌పోర్టు చేతికందాక తొలి విదేశీ పర్యటన వివరాలను కోర్టు తెలియాలని ఖుష్బూను న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
 
సినీ నటి ఖుష్బూపై ఉన్న 22 కేసులను అత్యున్నత న్యాయ స్థానం బుధవారం కొట్టివేసింది. వివాహానికి ముందు శృంగారం తప్పు కాదని ఖుష్బూ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో మొత్తం 22 క్రిమినల్, సివిల్ కేసులు దాఖలైన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి