ఎల్కే అద్వానీకి అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్...

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (09:53 IST)
ఢిల్లీ వృద్ధ రాజకీయ నేత, భారతీయ జనతా పార్టీ అగ్రనేత, భారతరత్న ఎల్కే.అద్వానీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ప్రైవేటు వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 
 
వృద్ధాప్య సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా అస్వస్థతకు లోనైనట్టు వైద్యులు వెల్లడించారు. వృద్దాప్య సమస్యల విభాగానికి సంబంధించిన వైద్యుల పర్యవేక్షణలో అద్వానీ ఉన్నారు. కాగా, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. 
 
అద్వానీ రాజకీయ జీవిత విషయానికి వస్తే కేంద్ర హోం మంత్రిగా, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు అద్వానీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, ఆ ఎన్నికల్లో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈయన 1927 నవంబరు 8వ తేదీన కరాచీలో (ప్రస్తుత పాకిస్థాన్) జన్మించారు. 1942లో స్వయంసేవక్‌గా ఆర్ఎస్ఎస్‌లో చేరారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా 1986 నుంటి 1990 వరకు, ఆ తర్వాత 1993 నుంచి 1998 వరకు, అనంతరం 2004 నుంచి 2005 వరకు అద్వానీ బాధ్యతలు నిర్వహించారు. 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిగా అద్వానీ రికార్డు సృష్టించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు