తన సారథ్యంలోని ఆర్జేడీని ఫినిష్ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధినేత అమిత్ షాలు కుట్ర పన్నారని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. బీహార్‌లో ప్రస్తుతం జేడీయు - ఆర్జేడీ కూటమి సర్కారు కొనసాగుతోంది. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ తనయుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తక్షణం సీఎం పదవి నుంచి తప్పుకోవాలంటూ సీఎం నితీశ్ కుమార్ అల్టిమేటం జారీ చేశారు.
దీనిపై లాలూ ప్రసాద్ యావద్ స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తనయుడు తేజస్వీ యాదవ్ నాలుగురోజుల్లోగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలన్న నితీశ్ అల్టిమేటంను అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 'హోటల్ ఒప్పందం కుదిరినప్పుడు తేజస్వి మైనర్. క్రికెట్ ప్లేయర్‌గా ఉన్నాడు. అతనిపై ఆరోపణలు ఆధారరహితం' అని లాలూ కొట్టిపారేశారు.
నితీశ్‌కుమార్ క్యాబినెట్ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్ చేసేందుకే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు.