రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనపై తాను ఏం మాట్లాడినా వివాదం అవుతుందన్నారు. అలా మాట్లాడిన ప్రతిసారి ఢిల్లీ పెద్దల నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఆలోచించాల్సి వస్తోందన్నారు.
ఓ శునకం చనిపోయినా సంతాపం తెలిపే ఢిల్లీ నేతలు సుదీర్ఘంగా సాగుతున్న నిరసనల్లో 600 మంది రైతులు మరణించినా ఆ విషయమే ఎరుగనట్టు ప్రవర్తిస్తున్నారని, లోక్‌సభలో వారి ప్రస్తావన కూడా తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్లాన్‌ను కూడా మాలిక్ విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనానికి బదులు ప్రపంచ స్థాయి కళాశాలను నిర్మిస్తే బాగుంటుందని హితవు పలికారు.
నిజానికి గవర్నర్‌ను తొలగించలేరని, కానీ తానేదైనా విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పదవి కోల్పోవాలని ఎదురుచూస్తున్నారని అన్నారు. అంతేకాదు, ఢిల్లీ నేతలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్న సంగతి తనకు తెలుసన్నారు. పదవిని వదులుకోమని చెబితే కనుక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్లిపోతానని సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు.
కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పిస్తున్న మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.