మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన పార్టీ తరఫున రవీంద్ర దత్తారామ్ వైకర్ పోటీ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ) నుంచి అన్మోల్ కీర్తికర్ నిలబడ్డారు. వీరి మధ్య ఆద్యంతం గెలుపు ఊగిసలాడింది. చివరకు 48 ఓట్ల తేడాతో రవీంద్ర విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 4,52,644 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అన్మోల్‌కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు పడటం గమనార్హం.
కేరళలోని అత్తింగళ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్వొకేట్ అదూర్ ప్రకాశ్ తన సమీప ప్రత్యర్థిపై 684 ఓట్లతో నెగ్గారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు రాగా.. 3,27,367 ఓట్లతో సీపీఎం అభ్యర్థి వి.జాయ్ రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పోలయ్యాయి.
ఒడిశాలోని జయపురంలో భాజపా అభ్యర్థి రబీంద్ర నారాయణ్ బెహరా (5,34,239 ఓట్లు).. తన సమీప బిజు జనతాదళ్ అభ్యర్థి శర్మిష్ఠా సేథి (5,32,652)పై 1587 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి.