మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను హిజాబ్ ధరించాలని బలవంతం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాల బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన తమ స్కూలు టాపర్లతో కూడిన ఒక ఫ్లెక్సీని విడుదల చేసింది. అందులోని ముస్లింలు కానీ అమ్మాయిలు కూడా స్కార్ప్స్ ధరించి కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూలు యాజమాన్యం ఒత్తిడి చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టర్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్‌పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రియాంక కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మే 30వ తేదీన తమకు ఎన్.సి.పి.సి.ఆర్. ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల కుటుంబాలను కలిశారని తెలిపారు. అయితే, ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ఇప్పటికే మేం ఈ విషయంపై లోతైన విచారణ కోసం దామోహ్ జిల్లా పోలీసు ఎస్పీని ఆదేశించినట్టు మిశ్రా వెల్లడించారు. అలాగే, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ అంశంపై దృష్టిసారించి నివేదిక కోరినట్టు సమాచారం.