ఆస్పత్రి బెడ్‌పై భర్త మృతి - గర్భిణి భార్యతో బెడ్ కడిగించిన వైద్యులు (Video)

ఠాగూర్

ఆదివారం, 3 నవంబరు 2024 (12:19 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆస్పత్రి బెడ్‌పైనే చనిపోయాడు. దీంతో అతని భార్య పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అయితే, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అత్యంత హీనంగా ప్రవర్తించారు. భర్తను కోల్పోయి బోరున విలపిస్తున్న భార్యతో భర్త ప్రాణాలు విడిచిన బెడ్‌ను శుభ్రం చేయించారు. పైగా, ఆ మహిళ ఐదు నెలల గర్భిణి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 
 
దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు డాక్టర్, ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు వేయగా, మిగిలిన సిబ్బందికి నోటీసులు జారీచేసింది. ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్‌ను బదిలీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డిండౌరీ జిల్లా గర్ణాసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్టోబరు 31వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గిరిజన గ్రామమైన లాల్పూర్‌లో గురువారం ఓ భూవివాదానికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా అదే రోజు శివరాజ్ మరావి (40) అనే వ్యక్తి మరణించాడు. దీంతో బెడ్‌పై ఉన్న రక్తపు మరకలను ఆసుపత్రి సిబ్బంది.. గర్భిణి అయిన ఆయన భార్యతో కడిగించారు.
 
అసలే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెతో బెడను కడిగించడం వివాదాస్పదమైంది. ఆమె బెడ్ కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. వైద్యుడు, ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. మిగతా సిబ్బందికి నోటీసులు జారీచేశారు. ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ సింగ్‌ను కరంజియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేసింది. 

 

The husband of a 5-month pregnant woman had died some time ago. After her husband's death, the government hospital administration forced her to clean the bed. The incident took place in Dindori, Madhya Pradesh. pic.twitter.com/WtASJ8JpV8

— The Dalit Voice (@ambedkariteIND) November 1, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు