గోవు మాంసం తరలిస్తున్నారనీ.. మధ్యప్రదేశ్‌లో మహిళల దాడి!

బుధవారం, 27 జులై 2016 (10:35 IST)
ఆవు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలపై హిందూ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. గుజరాత్ రాష్ట్రంలో దళితులపై జరిగిన అవమానవీయ ఘటన ఒకపక్క దేశాన్ని కుదిపేస్తుండగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై తాజాగా దాడి జరిగింది. 
 
మందసార్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ముస్లిం మహిళలపై హిందూ దళ్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. జయొరా ప్రాంతం నుంచి గోమాంసం తీసుకువచ్చారనే ఆరోపణలతో ఇద్దరు ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 30 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
వీరిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగానే హిందూ దళ్ కార్యకర్తలు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. ఇద్దరు మైనారిటీ మహిళలను నోటికొచ్చినట్టు దూషించి, విచక్షణారహితంగా కొట్టారు. బాధితులు కింద పడిపోయారు. ప్రత్యక్షసాక్షి ఒకరు వీడియో తీయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. తీరిగ్గా మేలుకున్న పోలీసులు అర్థ గంట తర్వాత ఇద్దరు మహిళలను స్టేషన్‌కు తరలించారు.
 
కాగా, వీరి నుంచి 30 కిలోల మాంసం స్వాధీనం చేసుకోగా, ఆ మాంసాన్ని పరిశీలించిన స్థానిక డాక్టర్లు గొడ్డుమాంసంగా ధ్రువీకరించారు. గొడ్డుమాంసం అక్రమ రవాణా చేస్తున్నారనే అభియోగాలపై ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి