మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - నీకు 9 నాకు 9... పదవుల పందేరం

మంగళవారం, 9 ఆగస్టు 2022 (14:55 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ - శివసేన తిరుగుబాటు వర్గ ప్రభుత్వం మంత్రవిర్గాన్ని విస్తరించింది. ఇందులో మొత్తం 18 మందికి చోటు కల్పించింది. వీరిలో 9 మంది భాజపా ఎమ్మెల్యేలు, మరో 9 మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా మంగళవారం ముంబైలో ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో మహారాష్ట్ర మంత్రివర్గం బలం 20కి చేరింది. 
 
నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 43 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. కానీ, ఇప్పటివరకు కేవలం 20 మందికి మాత్రమే చోటు కల్పించారు. అయితే, ఈ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. గవర్నర్ బీఎస్​ కోశ్యారీ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. 15 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణస్వీకారం జరిగింది. 
 
భాజపా నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా సుధీర్ ముంగటివార్, గిరిష్ మహాజన్, సురేశ్ ఖాడె, రాధాకృష్ణ విఖె పాటిల్, రవీంద్ర చవాన్, మంగల్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సావె మంత్రి పదవి దక్కించుకున్నారు. 
 
అలాగే, శివసేన వర్గం నుంచి దాదా భూసే, శంభురాజే దేశాయ్, సందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసార్కర్, గులాబ్​రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్​​ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో భాజపా - శివసేన(శిండే వర్గం) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు