వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ, అధికార టీఎంసీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా, తన పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సువేందు అధికారి, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. అధికారం కుటుంబం నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోయిన "ఓ పెద్ద గాడిదను నేను" అంటూ వ్యాఖ్యానించారు.
కాంతి దక్షిణ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ ... అధికారి కుటుంబం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పూర్బ మేదినీపూర్ జిల్లాలో అధికారి కుటుంబం రూ.5 వేల కోట్ల సామ్రాజ్యాన్ని అక్రమంగా నిర్మించుకున్నారని, తాను మళ్లీ అధికారంలోకి వస్తే వాళ్లపై ఆస్తులపై విచారణ జరుపుతానని ప్రకటించారు.
తన రాజకీయ జీవితంలో నరేంద్ర మోడీ వంటి ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని, బహుశా చూడకపోవచ్చని ఆమె అన్నారు. దుర్మార్గులకు, ఉన్మాదులకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ మారిందని, ఈ దేశానికి ఇంతకంటే విపత్కర పరిస్థితి ఇంకేం ఉంటుందని మమత అన్నారు.
'బీజేపీ అంటే భారతీయ జొఘొన్నొ(చెడ్డ) పార్టీ. బీజేపీ వాళ్లు చేసే పనులన్నీ చెడ్డవే. నిజానికి వారు ఇలాంటి పనులు మాత్రమే చేయగలరు. నేను ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాను, నా రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూశాను. కానీ నరేంద్ర మోడీ లాంటి ఇంత క్రూరమైన, కర్కషమైన ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదు. బహుశా చూడకపోవచ్చు కూడా. బీజేపీ అనేది పూర్తిగా మూర్ఖులు, దుర్మార్గులు, రావణ, దుర్యోదన, దుశ్శాసన, ఉగ్ర మూకలతో నిండిపోయిన పార్టీ' అని మమతా బెనర్జీ అన్నారు.