మమతా బెనర్జీకి ఎడమ కాలు చీలమండ - పాదం ఎముకలో గాయం!

గురువారం, 11 మార్చి 2021 (12:56 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె గాయపడింది. ప్రస్తుతం కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు గురువారం ఉదయం నివేదిక విడుదల చేశారు. 
 
ఆమె ఎడమ కాలు చీలమండ, పాదంలో తీవ్రమైన ఎముక గాయాలను గుర్తించినట్లు వెల్లడించారు. దీదీ కుడి భుజం, మెడకు కూడా గాయమైనట్లు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నుంచి సీఎం.. ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారని, ఆమెను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. మరిన్ని వైద్యపరీక్షలు చేయాల్సి ఉందన్నారు. 
 
కాగా, నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న దీదీని బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తోసేసిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన అనంతరం రేయపారా ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించి తిరిగి కారు ఎక్కుతుండగా.. కొంతమంది తనను బలవంతంగా తోసి, కారు తలుపు వేసినట్లు మమత వెల్లడించారు. ఆ సమయంలో కాలు నొప్పితో విలవిల్లాడుతున్న సీఎంను వెంటనే కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా.. కాలి మడమలో పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. 
 
మరోవైపు సీఎం కాలికి గాయం నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. దీదీపై కుట్రపూరితంగానే భాజపా దాడి చేసిందని తృణమూల్‌ ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలను కాషాయ పార్టీ ఖండించింది.
 
మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అదంతా నాటకమని దుయ్యబట్టింది. చిన్న ప్రమాదాన్ని దీదీ పెద్దది చేసి చూపుతున్నారని ఎద్దేవా చేసింది. అయితే భాజపా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ.. భాజపాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ‘‘బెంగాల్‌ ప్రజల పవర్‌ ఏంటో మే 2వ తేదీన తెలుస్తుంది. దాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ భాజపాకు సవాల్‌ విసిరారు. 
 
మరోవైపు, కాలుకు దెబ్బతగిలన మమతా బెనర్జీ ప్రస్తుతం కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కాలికి గాయం అయింద‌ని తెలుపుతూ ఆమె కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో వైర‌ల్ చేశారు. 
 
అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం, ఓట‌ర్ల సానుభూతి పొందడం కోస‌మే ఆమె ఎన్నిక‌ల ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. నందిగ్రామ్‌లో ఓ ప్రాంతంలో మ‌మ‌తపై దాడి జ‌రిగింద‌ని టీఎంసీ నేత‌లు అంటుండ‌గా, అదే స‌మ‌యంలో ప్రాంతంలో ఉన్న కొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు మాత్రం అస‌లు ఆమెకు అక్క‌డ ఏమీ కాలేద‌ని చెబుతున్నారు. 
 
స్థానిక‌ విద్యార్థి సుమ‌న్ మైతీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి కారులో ఇక్క‌డ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో చాలా మంది ఆమె చుట్టూ చేరారని అన్నాడు. మ‌మ‌తను ఎవ‌రూ తోయ‌లేద‌ని, అయితే, ఆమె మెడ, కాలికి గాయం అయిన‌ట్లు అనంత‌రం తెలిసింద‌ని, ఆ స‌మ‌యంలో ఆమె కారు మెల్లిగా క‌దులుతూ ముందుకు వెళ్ల‌డాన్ని చూశాన‌ని చెప్పాడు.
 
చిత్రంజ‌న్ దాస్ అనే మ‌రో వ్య‌క్తి మాట్లాడుతూ... 'నేను ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్నాను. ఆమె కారులోనే కూర్చుని ఉన్నారు. అయితే, కారు త‌లుపు తెరుచుకుని ఉంది. ఆ త‌లుపు ఓ పోస్ట‌ర్‌కు త‌గ‌ల‌గానే దాన్ని మూసేశారు. ఆమెను ఎవ్వ‌రూ తోసేయ‌లేదు, కొట్టలేదు. ఆ కారు త‌లుపు వ‌ద్ద ఆ స‌మ‌యంలో ఎవ్వ‌రూ లేరు' అని తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు