ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరి మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం జరుగుతోంది.
తాజాగా, పశ్చిమ బెంగాల్‌లో కొందరు వ్యక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేయగా, మమత వారిపై తీవ్రంగా మండిపడినట్టు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఈ ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. తాను కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తానని, తనను అరెస్ట్ చేయించగలరా? అంటూ ప్రశ్నించారు. "జై శ్రీరామ్ నినాదాలు చేస్తే జైల్లో పెట్టిస్తారా? ఏదీ, నేను కూడా జై శ్రీరామ్ అంటాను, నన్ను జైల్లో పెట్టించు, చూద్దాం!" అంటూ మోదీ కామెంట్స్ చేశారు.
"దీదీ ఈ మధ్య తీవ్ర అసహనంతో ఉన్నారు, దేవుడి గురించి మాట్లాడడంలేదు, దేవుడి గురించి వినడంలేదు, ఆమె ప్రధాని కావాలని ఆశపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు సొంత రాష్ట్రంలో పది సీట్లు కూడా రావు" అంటూ ఎద్దేవా చేశారు.
తాను ఫోన్ చేసిన తర్వాత మమత తిరిగి తనకు ఫోన్ చేస్తారని అనుకున్నానని... కానీ ఆమె నుంచి తనకు ఫోన్ రాలేదని మోదీ అన్నారు. అయినా పట్టించుకోకుండా, తాను మరోసారి ఆమెకు ఫోన్ చేశానని... రెండోసారి కూడా ఆమె తనతో మాట్లాడలేదని చెప్పారు.