మానవ ప్రపంచానికి దూరంగా అడివిలో కోతులతో కలిసి జీవిస్తున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు రక్షించారు. మోతీపూర్ రేంజ్‌లో ఎప్పటిలాగే పెట్రోలింగ్‌కి వెళ్లిన ఇన్‌స్పెక్టర్ సురేష్ యాదవ్ ఆ చిన్నారి కోతులతో కలిసి వుండటం గమనించారు. కోతుల నుంచి ఆ చిన్నారిని వేరు చేసి, రక్షించేందుకు పోలీసులు చాలానే శ్రమించాల్సి వచ్చింది. చిన్నారిని రక్షించే క్రమంలో కోతులు సైతం సురేష్ యాదవ్‌పైకి తిరగబడ్డాయి. ఎలాగోలా కష్టపడి చిన్నారిని ఆ కోతుల బారి నుంచి కాపాడిన పోలీసులు ఆమెని బహ్రెచ్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.
కానీ ఆస్పత్రిలో అయితే, చిన్నారి మాత్రం సాధారణ మనుషుల్లా మాట్లాడలేకపోవడం, తమ భాషని అర్థం చేసుకోలేకపోవడం వంటి పరిణామాలు ఆమెకి చికిత్స అందించడం కొంత ఇబ్బంది కలిగించాయి. అన్నింటికిమించి జనాన్ని చూస్తేనే ఆమె భయపడిపోవడం, కోపం తెచ్చుకోవడం చేస్తోందని చెబుతున్నారు చిన్నారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు. చికిత్స అనంతరం చిన్నారిలో చాలా నెమ్మదిగా మార్పు కనిపిస్తోంది. మనుషుల్లా మాములుగా కాళ్లపై నిలబడి నడవటం నేర్పించినప్పటికీ… చిన్నారి మాత్రం అప్పుడప్పుడు జంతువుల్లా ఒకేసారి కాళ్లు, చేతులు నేలపై పెట్టి నడుస్తోందని చెప్పారు.
అయితే ఈ బాలికను ఇన్నాళ్లూ పెంచిన కోతులు ఆసుపత్రి చుట్టూ చేరుతున్నాయి. తమతో చిన్ననాటి నుంచి ఆడుకున్న ఆ బాలిక మళ్లీ తమ దగ్గరకు వచ్చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నాయి. ఆమెను చిన్నప్పటి నుంచి పెంచిన కోతులంతా ఆసుపత్రి చుట్టూ తిరుగుతుండడంతో అక్కడి వారిని కదిలిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.