తనను మోసం చేసి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుందన్న అక్కసుతో ప్రియురాలిని హత్య చేశాడో కిరాతక వ్యక్తి. ఈ హత్యను ఆత్మహత్యగా కొద్దిరోజులు నమ్మించాడు. అయితే, సీసీటీవీ కెమెరాలు మాత్రం అతన్ని పట్టించాయి. ఈ హత్య కేసు మహారాష్ట్రలో జల్నా జిల్లాలో ఈనెల 21వ తేదీన జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని జల్నా ఏరియాకు చెందిన సచిన్ గైక్వాడ్, దీపాలి రమేశ్ షిండ్గే(20) అనే ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే, ఆర్నెల్ల క్రితం దీపాలికి ఆమె కుటుంబ సభ్యులు అవినాష్ వంజరే అనే యువకుడితో వివాహం చేశారు. ఈ విషయం సచిన్‌కు తెలియడంతో లోలోపల రగిలిపోయాడు. తనను మోసం చేసి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాడు.
ఈ క్రమంలో సచిన్ ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నెల 21న ఆమెను బయటకు తీసుకెళ్లిన సచిన్... ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో దీపాలి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత దీపాలి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. జల్నాకు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి పట్టాలపై వదిలేశాడు. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ సృష్టించాడు. అంతేకాకుండా, భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని దీపాలి సెల్‌ఫోన్ నుంచి ఆమె తండ్రికి సచిన్ మేసేజ్ చేశాడు. మేసేజ్ ఆధారంగా అవినాష్ వంజేరపై దీపాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అవినాష్‌ను అరెస్టు చేశారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో దీపాలిది ఆత్మహత్య కాదనీ, హత్య అని తేలింది. పైగా, దీపాలి కేసులో భర్తకు ఎలాంటి సంబంధం లేదని తేలపోవడంతో అతన్ని వదిలివేశారు. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. సీసీటీవీ ఫుటేజీలు అసలు నిందితుడుని పట్టించాయి. ఈనెల 26న నిందితుడు సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.