నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం... 17 రోజుల్లోనే జైలుశిక్ష

గురువారం, 19 డిశెంబరు 2019 (10:38 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో నాలుగేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడుకి కేవలం 17 రోజుల్లోనే జైలుశిక్ష పడింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
గత నెల 30వ తేదీన దయారాం మేఘ్వాల్ అనే వ్యక్తి సమీపంలో నివసించే నాలుగేళ్ళ చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారం జరిగిన మరుసటి రోజే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణ కోసం పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ రోజువారీగా సాగగా, ఈ నెల 7వ తేదీన చార్జిషీటును దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఏడు రోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టు 17 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్ష విధించడం గమనార్హం. పోక్సో చట్టం కింద ఇంత స్వల్ప సమయంలో నిందితుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు