నాగరిక సమాజానికి దూరంగా నిత్యం తూటాలు, కన్నీళ్ల మధ్య.. చుట్టాలను వదిలి చట్టాలకు వ్యతిరేకంగా కష్టాలు పడుతూ.. ఏ నిమిషంలో ప్రాణం పోతుందో తెలియని పరిస్థితుల్లో కేవలం బావ కోసం పోయిన మరదలు సమ్మక్క అలియాస్ శారద.
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంకు చెందిన సమ్మక్క, నారాయణలు సొంతం బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి ఒకరంటే మరొకరికి ప్రాణం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన యాప నారాయణ, విద్యార్థి దశలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్‌యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు.
అయితే, బావను ఎంతగానో ఇష్టపడి చదువు పూర్తయ్యాక మనువాడాలని భావించిన మరదలుకి దళంలో చేరిన బావ మీద ఇష్టం మాత్రం తగ్గలేదు. సొంతూరు, సొంతవారు అనే బంధాలను తెంచుకుని, బావను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి, పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసి బావ అడుగుల్లో అడుగై, ఆశయాలు పంచుకుంటూ బతకసాగింది.