ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

ఠాగూర్

బుధవారం, 8 అక్టోబరు 2025 (17:40 IST)
ఢిల్లీ - కోల్‌కతా జాతీయ రహదారిపై గత నాలుగు రోజులుగా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. దేశంలోనే అత్యంత రద్దీ జాతీయ రహదారిగా ఢిల్లీ - కోల్‌కతా హైవే (ఎన్.హెచ్-19)కు ఉంది. అయితే, ఈ రహదారిపై వాహనదారులకు, ప్రయాణికులకు ప్రమాణం ఓ నరక ప్రాయంగా మారింది. ఈ రహదారిపై గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడివుంది. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ - రోహ్‌తక్ మధ్యలో భారీ వర్షానికి వరద నీరు జాతీయ రహదారిని ముంచెత్తింది. దీంతో 65 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత నాలుగు రోజులుగా సరైన ఆహారం, నీళ్లు లేక వాహనదారులు, వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని రోహ్‌‌తక్ జిల్లాలో గత శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో వరద నీపు ముంచెత్తింది. జాతీయ రహదారి 19పై ఆరు వరుసల రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మళ్లింపులు, సర్వీస్ రోడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి, నీరు నిలిచిపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ గంటగంటకు మరింత తీవ్రమవుతోంది. రోహ్‌తక్ జిల్లాలో మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది.
 
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాహనాలు 24 గంటల్లో కేవలం 5 కిలోమీటర్లు కూడా ముందుకు కదలడం లేదు. 'గత 30 గంటల్లో మేము కేవలం 7 కిలోమీటర్ల ప్రయాణించాం. టోల్, రోడ్ ట్యాక్సులు అన్నీ కడుతున్నా గంటల తరబడి ట్రాఫిక్ చిక్కుకున్నాం. ఇక్కడ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఏ.ఐ) సిబ్బందిగానీ, స్థానిక అధికారులుగానీ కనిపించడం లేదు' అని ప్రవీణ్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
'రెండు రోజులుగా ట్రాఫిక్‌లోనే ఉన్నాం. ఆకలి, దాహంతో అల్లాడుతున్నాం. కొన్ని కిలోమీటర్లు దాటడానికే గంటలు పడుతోంది' అని సంజయ్ సింగ్ అనే మరో డ్రైవర్ వాపోయారు. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పండ్లు, కూరగాయల వంటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు, పర్యాటక వాహనాలు, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


 

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్‌ జామ్‌

రోడ్లపైనే పడిగాపులు కాస్తూ నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు

బీహార్‌లోని ఔరంగాబాద్ - రోహ్‌తాస్ మద్యలో భారీ వర్షానికి హైవేను ముంచెత్తిన వరద నీరు

దీంతో 65 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్

అధికారుల సమన్వయ లోపంతో… pic.twitter.com/8HdNHD8Lps

— Telugu Scribe (@TeluguScribe) October 8, 2025

వెబ్దునియా పై చదవండి