ట్రిపుల్ తలాక్‌పై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో ఓ ముస్లిం మహిళ కట్టుకున్న భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పింది. అనైతిక శృంగారంతోపాటు.. భర్త, భర్త సోదరుడు పెడుతున్న వేధింపులు తాళలేక భర్తకు విడాకులు ఇస్తున్నట్టు మీరట్‌కు చెందిన మహిళ వెల్లడించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన అమ్రీన్, ఫర్హీన్ అనే అక్కా చెల్లెళ్లు సాబీర్, షకీర్ అనే సోదరులను గత 2012లో వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో కట్నకానుకలు బాగానే ఇచ్చారు. అయితే, వివాహ జరిగిన తర్వాత భర్తతో పాటు.. అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
ఈనేపథ్యంలో భార్యాభర్తల వచ్చిన చిన్న తగాదా వల్ల ఫర్హీన్‌కు ఆమె భర్త గత యేడాది సెప్టెంబరులో ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి పుట్టింటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పెళ్ళి చేసుకొన్ననాటి నుండి భర్త అతడి సోదరుడు, కుటుంబసభ్యులు హింసిస్తున్నారని అమ్రీన్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై ఆమె స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈక్రమంలో బుధవారం పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత అమ్రీన్ స్పందిస్తూ తన భర్త ఏం పట్టించుకోరు. కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. పిల్లలను కూడా పట్టించుకోరు. అందుకే అతన్ని జైలుకు పంపాలని నిర్ణయించుకున్నా. పైగా, భర్తకు నేనే విడాకులు ఇచ్చేలా ట్రిపుల్ తలాక్ చెప్పాలనుకుంటున్నా. తమ మత పెద్దల వద్దే ట్రిపుల్ తలాక్ చెప్పి భర్తకు విడాకులు ఇస్తానని తెలిపింది.
తమను శారీరకంగా హింసించడమే కాకుండా అనైతిక శృంగార కార్యక్రమాలకు ఆ ఇద్దరు సోదరులు పాల్పడేవారంటూ ఆమె తన గోడును వెళ్ళబోసుకుంది. అందుకే తామే వారికి శిక్ష వేయాలని భావిస్తున్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఈ మహిళ చేసిన వ్యాఖ్యలు ముస్లిం మతపెద్దల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇప్పటివరకు పురుషులు మాత్రమే ట్రిపుల్ తలాక్ చెపుతూ వచ్చారు. కానీ, అమ్రీన్ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు ట్రిపుల్ తలాక్ చెప్పనున్నట్టు ప్రకటించడంతో మతపెద్దలు ఖంగుతింటున్నారు.