మేరా భారత్ మహాన్ నమస్కార్... ఒబామా, మోడీపై కూడా...

ఆదివారం, 25 జనవరి 2015 (22:05 IST)
భారత్‌కు మూడు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశంతో మైత్రి మరింతగా బలపడటం తన హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఒక పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన అమెరికా మొదటి అధ్యక్షుడిని కూడా తనే కావడం సంతోషంగా ఉందన్నారు.
 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత గణతంత్రవేడుకల ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలని అన్నారు. గణతంత్రవేడుకలకు హాజరైన తొలి అధ్యక్షుడు, రెండు సార్లు భారత్ వచ్చిన తొలి అధ్యక్షుడు తానేనని ఆయన సగర్వంగా ప్రకటించారు.
 
భారతీయుల ఆత్మీయతలు తనను కట్టిపడేశాయని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్నారు. మోడీ ప్రసంగం బాలీవుడ్ హీరోను తలపించిందన్నారు. పౌర అణు ఒప్పందం, పెట్టుబడులపై రెండు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. సౌరశక్తి వినియోగం, వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం అరికట్టడం వంటి అంశాలపై రెండు దేశాల భాగస్వామ్యం కీలకమని ఒబామా నొక్కివక్కాణించారు. అమెరికా రక్షణ సహకారం మరో పదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగుతుందని ఒబామా హామీ ఇచ్చారు.
 
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. న్యూయార్క్ సిటీలో నరేంద్ర మోడీ ప్రసంగం మరువలేమని ఆయన తెలిపారు. రేపటి వేడుకల కోసం తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్నారు. పేదరికి నిర్మూలనకు అమెరికా సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. అదేసమయంలో రష్యా అర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ తిరుగుబాటుదారులకు రష్యా సహకరించడం ఆపాలని హితవు పలికారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అమెరికా పోరాటం సాగిస్తుందని, దేశాల రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోమని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి