సముద్రపు నీటిపై తేలాడుతున్న నారింజ రంగు డ్రమ్ములు... ఆ విమానం ఆచూకీపై పురోగతి?

బుధవారం, 27 జులై 2016 (10:18 IST)
బంగాళాఖాతం సముద్ర జలాలపై రెండు నారింజ రంగు డ్రమ్ములు తేలాడుతున్నాయి. ఇవి ఇటీవల అదృశ్యమైన ఏఎన్-32 రకం విమానం ఆచూకీ తెలియజేస్తాయన్న చిన్న ఆశ ఏర్పడింది. శిక్షణలో భాగంగా, చెన్నై తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన ఏఎన్-32 విమానం... కొద్ది నిమిషాల్లోనే అదృశ్యమైన విషయం తెల్సిందే. ఈ విమానం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఈ విమానం వెతుకులాటలో పురోగతి కనిపించినట్టు తెలుస్తోంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో రెండు నారింజరంగు డ్రమ్ములను నేవీ సిబ్బంది గుర్తించారు. ఈ రెండు డ్రమ్ములు చెన్నై నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌‌కు వెళ్తూ జాడలేకుండా పోయిన విమానానివేనని వారు భావిస్తున్నారు. 
 
నారింజరంగులో ఉన్న ఈ రెండు డ్రమ్ములు కూలిపోయిందని భావిస్తున్న విమానానికి చెందినవేనని, ఆ విమానం కోసం బంగాళాఖాతంలో గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌, నేవీ సిబ్బంది బలంగా నమ్ముతున్నారు. అయితే ఆ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించి ఉంటారని వారు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి