బాహుబలి నుంచి మావోల వరకు.. బాణాలకు పెరిగిన డిమాండ్

మంగళవారం, 14 మార్చి 2017 (04:14 IST)
అటు మారణాయుధాలను, ఇటు సాంప్రదాయిక ఆయుధాలను ఉపయోగించడంలో మావోయిస్టులు రాటుదేలుతున్నారా? అటు రాంబో.. ఇటు బాహుబలి టెక్నిక్‌లను తలదన్నుతూ భద్రతాబలగాలకు చెమటలు పోయిస్తున్న మావోయిస్టుల సరికొత్త అమ్ములపొదిలో బాణాలు వచ్చి చేరాయి. మూడు రోజుల క్రితం చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బెజ్జీలో జరిగిన మెరుపుదాడిలో మావోయిస్టులు నిజంగానే బాణాలతో కొట్టారు. అల్లూరు సీతారామరాజు సినిమాలో చూపినట్లుగా బాణాలకు మంటల బాంబులు దట్టించి జవాన్లపై ప్రయోగించిన తీరు చూసి సాయుధ బలగాలు నివ్వెరపోయాయి. 
 
ఇన్నాళ్లుగా ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, యూబీజీ వంటి ఆయుధాలను వినియోగిస్తూ వస్తున్న మావోయిస్టులు ప్రస్తుతం సొంత సాంకేతికత పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకుంటున్నట్లు తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో వచ్చిన హాలీవుడ్‌ హిట్‌ సినిమా ‘రాంబో’లో నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ తనను పట్టుకునేం దుకు వచ్చిన శత్రువులపై బాంబు బాణాలు, మోర్టార్లతో దాడి చేస్తాడు. అదే సీన్‌ను మూడు రోజుల క్రితం చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బెజ్జీ లో జరిగిన మెరుపుదాడిలో మావోయిస్టులు రిపీట్‌ చేశారు. 
 
రాంబో సినిమాలో మాదిరి గానే బాణాలకు బాంబులు (ఐఈడీ) అమర్చి జవాన్లపై ప్రయోగించారు. సంఘటనా స్థలం లో భారీ ఎత్తున ఈ తరహా బాంబు బాణాలు, దేశవాళీ మోర్టార్లు, టిఫిన్‌ బాంబులు పోలీసులకు లభ్యమయ్యాయి. పక్కా ప్రణాళికతో భారీ దాడికి పాల్ప డేందుకే మావో యిస్టులు అత్యాధునిక ఆయుధాలను వినియో గించారని అధికారులు చెబుతున్నారు.
 
మావోయిస్టులకు సహకరిస్తున్న మిలీషియా సభ్యులు బాణాలను గురి తప్పకుండా సంధించడంలో నిష్ణాతులని చెప్పవచ్చు.  పోలీసులపై దాడి చేసేటప్పుడు కేవలం సాధారణ బాణాలే వినియోగించేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వారికి బాంబులతో కూడిన బాణాల వినియోగంపై పూర్తిస్థాయి తర్పీదు ఇచ్చినట్లు తెలిసింది. దీని కోసం మావోయిస్టులు అడవుల్లోనే కార్ఖానాలు ఏర్పాటు చేసి మోర్టార్లు, బాంబు బాణాలు తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పోలీసులు వచ్చే ప్రదేశాన్ని కచ్చితం గా అంచనా వేస్తున్న మావోయిస్టులు అక్కడే ఎత్తయిన కొండలపై మాటువేస్తున్నారు. పోలీసులు ఆ ప్రదేశానికి రాగానే నలువైపుల నుంచి  బాంబు బాణాలతో దాడి చేస్తున్నారు. మోర్టార్లు, మందుపాతరలు పేల్చి పోలీసులను మట్టు బెడుతున్నారు. తాజాగా బెజ్జీ ప్రాంతంలో  మావోయిస్టులు ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు.
 
మావోయిస్టులు 2010 ఏప్రిల్‌లో ఇదే జిల్లా చింతల్‌నార్‌ వద్ద దేశంలోనే అతిపెద్ద దాడికి పాల్పడ్డారు. అయితే, అప్పుడు బాంబు బాణాలు వినియోగించలేదు. తాజాగా బాణాల బాం బులతో దాడులు చేస్తుండడంపై పోలీసు అధి కారులు సైతం విస్మయం చెందుతు న్నారు. మిలీషియా సభ్యు లు ప్రయోగిస్తున్న బాంబు బాణాలు ఏవైపు నుంచి వస్తాయో తెలియని స్థితిలో ప్రతిదాడి ఎలా చేయాలో ఆలోచించుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. తాజా ఘటనలో పోలీసులకు భారీ నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో మావోయి స్టులు టిఫిన్‌ బాక్స్‌ బాంబులను కూడా అమర్చారు.
 
బెజ్జీ ఘటనకు ముందు పోలీసులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. గతంలో చింతల్‌నార్‌లో జరిగిన దాడిలో 76 మంది పోలీసులు ఒకే బృందంగా వెళ్లి మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోయారు. మరోసారి అదే వ్యూహంతో మావోయిస్టులు మాటు వేశారు. ముందుగా వెళ్లిన బృందంపై దాడికి పాల్పడ్డారు. రెండో బృందం వెనుకనే ఉండిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
 

వెబ్దునియా పై చదవండి