కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు... పరిస్థితి అదుపులోనే ఉందన్న మంత్రి వీణా జార్జ్

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (16:50 IST)
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 265 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 640 కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలుపుకుంటే 2606కు చేరింది. ఒకరు మృతి చెందారు. కేరళ తర్వాత తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే, తెలంగాణాలో ఐదు కేసులు నమోదు కాగా, ఏపీలో మూడు, కర్నాటకలో 13 కేసులు నమోదయ్యాయి. జేఎన్1 కొత్త వేరియంట్ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
 
మరోవైపు, కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ అన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి అధికంగానే ఉన్నప్పటికీ.. తీవ్రత తక్కువేనన్నారు. శుక్రవారం ఆమె పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. తమ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడారు. కేరళలో కొవిడ్‌ కేసులు స్వల్పంగా పెరిగినట్లు గుర్తించామన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి సమావేశం జరిగిందన్నారు 
 
నవంబరులోనే నోమిక్‌ సీక్వెన్సింగ్‌ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని.. అప్పుడే 79 ఏళ్ల వృద్ధురాలికి జేఎన్‌.1 వేరియంట్‌ సోకినట్లు తేలిందన్నారు. అయితే, ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని.. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు కేరళలో కొవిడ్‌ పరీక్షలు అధికంగా చేస్తున్నామన్నారు. కేరళలో కరోనా పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.
 
ఐసీయూ, వెంటిలేటర్‌, ఐసోలేషన్‌ విభాగాల్లో పడకల ఆక్యుపెన్సీ ఏమీ పెరగలేదని.. ఇటీవలి కాలంలో నమోదైన కొవిడ్‌ మృతుల్లో కూడా దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్నవారే ఉన్నారని మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. మున్ముందు ఇంకా కొన్ని కేసులు రావొచ్చని భావిస్తున్నామని.. అందుకే కొవిడ్‌ కట్టడికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ఐసోలేషన్‌ పడకలతో పాటు అంతా సిద్ధం చేశామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు