బాలీవుడ్‌ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోం : సీఎం ఉద్ధవ్ ఠాక్రే

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (13:57 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సీరియస్ అయ్యారు. కొందరు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీయాలని భావిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. 
 
శుక్రవారం సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్‌ యజమానులతో సీఎం ఉద్ధవ్ ఓ సమీక్షా సమావేశం నిర్వహించాు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ముంబై దేశ ఆర్థిక రాజధాని మాత్రమే కాదని, వినోదానికి కేంద్ర బిందువని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ను ప్రపంచం మొత్తం ఆస్వాదిస్తున్నది, కానీ కొన్నిరోజులుగా దాని ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న పరిణామాలు బాధకరమన్నారు. 
 
ముఖ్యంగా, బాలీవుడ్‌ చిత్రపరిశ్రమను అప్రతిష్టపాలు చేసేందుకు, తరలించేందుకు చేస్తున్న యత్నాలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసులో మీడియా బాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. ఇకపోతే, సినీనిర్మాతలను ఆకర్షించేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలో కొత్తగా ఫిలింసిటీ నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. 
 
కాగా, కరోనా నిబంధనలకు అనుగుణంగా సినిమాహాళ్లను, మల్టీప్లెక్స్‌లను తిరిగి తెరిచేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ విధివిధానాలు రూపొందించిందని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అమిత్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. వినోద పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతానిస్తున్నదని, దీనిని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
 
సినిమాహాళ్లను శుభ్రం చేసి, శానిటైజ్‌ చేసిన తరువాతే ప్రేక్షకులను అనుమతిస్తామని, భౌతికదూరం పాటించేలా కేవలం 50శాతం మంది ప్రేక్షకులను మాత్రమే థియేటర్‌లోకి అనుమతిస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి అమిత్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు