ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ సింగ్ యాదవ్, భార్య అపర్ణతో కలిసి సమావేశమయ్యారు. శుక్రవారం లక్నోలోని సీఎం అతిథిగృహంలో యోగిని కలిసిన వీరు దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ మర్యాద పూర్వకంగానే అని ఎస్పీ నేతలు చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన ఎస్పీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఎన్నికలకు ముందు ములాయం సింగ్ కుటుంబంలో చెలరేగిన చిచ్చు... చివరకు ఆ పార్టీ ఘోర పరాజయానికి దారితీసింది.
ఈనేపథ్యంలో ములాయం చిన్న కుమారుడు, కోడలు సీఎం యోగితో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం చిన్న కోడలు అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి బరిలోకి దిగి... బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు.
వాస్తవానికి తొలుత అఖిలేశ్ కుటుంబం, ప్రతీక్ కుటుంబం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. ఎన్నికల ప్రచార సమయంలో అపర్ణకు మద్దతుగా అఖిలేశ్ భార్య, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ తదితరులు ప్రచారం చేసినప్పటికీ.. ఆమెను గెలిపించలేక పోయారు. ఇపుడు సీఎం యోగితో ప్రతీక్, అపర్ణలు భేటీ కావడం వెనుక వారిద్దరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అనే కోణంలో చర్చ సాగుతోంది.