కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు ఆధారంగా త్వరలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు జరగవచ్చని భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే.. 27 మంది నేతల పేర్లను ఆ పార్టీ అగ్రనాయకత్వం పరిశీలించిందని తెలుస్తోంది. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీ, సర్బానంద్ సోనోవాల్, నారాయణ రాణె, భూపేంద్ర యాదవ్ వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అఖిల పక్షాలతో జమ్ముకశ్మీర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు పూర్తైన నేపథ్యంలో మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. అంతకుముందు.. కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలతో రెండు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో.. త్వరలోనే విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 27 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భాజపా అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
కేంద్రమంత్రి వర్గంలోని పలువురు... అదనపు బాధ్యతలను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో... వీటిని కొత్త వారికి అప్పగించి కేబినెట్ హోదా కల్పించాలని భాజపా అగ్రనాయకత్వం యోచిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్యాశాఖ, పౌర విమానయానం, ఆహార శుద్ధి వంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని సమాచారం. అలాగే అంతగా ప్రభావం చూపని కొందరు మంత్రులను తొలగించి కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.