భారత్ కాస్త మోడీ దేశంగా మారిపోతోంది : మమతా బెనర్జీ

మంగళవారం, 9 మార్చి 2021 (10:41 IST)
భారతదేశం పేరును మోడీ దేశంగా మార్చే రోజులు మరెంతో దూరంలో లేవని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న కోల్‌కతాలో ‘దీదీర్ సాథ్ అమ్రా (దీదీతో మేమున్నాం) ర్యాలీ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియానికి మోడీ పేరు పెట్టినట్టే దేశానికి కూడా మోడీ పేరు పెడతారని, ఆ రోజు ఎంతో దూరం లేదని మండిపడ్డారు. 
 
మోడీ చెబుతున్న ప్రతి ఒక్కటీ అబద్ధమేనన్న మమత.. బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని మోడీ ఉపన్యాసాలు దంచికొడుతున్నారని, మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు.
 
"మోడీ తన పేరును అంతటా వ్యాపింపజేస్తున్నారు. అన్నింటికీ ఆయన పేరే పెట్టుకుంటున్నారు. కొవిడ్ వ్యాక్సిన్లపైనా ఆయన ఫొటోలు ముద్రించారు. ఇప్పుడది కొవిడ్ వ్యాక్సిన్ కాదు, మోడీ వ్యాక్సిన్. చాలా కాలేజీలు ఇప్పటికే మోడీ పేరుతో నడుస్తున్నాయి. ఇప్పుడు స్టేడియానికి కూడా తన పేరు పెట్టేసుకున్నారు. చూస్తూ ఉండండి ఈ దేశం పేరును కూడా మార్చేసి తన పేరు పెట్టుకుంటారు" అంటూ మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
బెంగాల్‌లో కమలనాథుల ఆశలు గల్లంతే...
దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఆశలు అడియాసలు అయ్యేలవుతాయని టైమ్స్ నౌ - సి ఓటర్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 
 
రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో అధికార టీఎంసీ 154 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంటుందని సర్వే అంచనా వేసింది. బీజేపీకి 107 స్థానాలు వచ్చే అవకాశం ఉందని గుర్తుచేసింది. 
 
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి 33 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అయితే, హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో మాత్రం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 160 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తేలింది.
 
ఇకపోతే, తమిళనాడు ఎన్నికలను ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీకి ఈసారీ ఇక్కడ చుక్కెదురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 234 శాసనసభ స్థానాలుండగా డీఎంకే కూటమికి 158, అధికార అన్నాడీఎంకే - బీజేపీ కూటమికి 65 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ-సి ఓటర్ సర్వే అంచనా వేసింది.
 
అలాగే, కేరళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు గత ఎన్నికల్లోనూ బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిపట్టుదలగా ఉంది. అయితే, ఈసారి కూడా కేరళ వామపక్ష కూటమిదేనని సర్వేలో తేలింది. ఇక్కడ మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్ 78-86 స్థానాల్లో విజయం సాధిస్తుందని, యూడీఎఫ్‌కు 52-60 మధ్య సీట్లు లభించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. ఇక, బీజేపీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధిస్తుందని తెలిపింది.
 
అసోంలోనూ పోరు హోరాహోరీగానే సాగుతుందని అయితే, బీజేపీ మాత్రం విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 126 స్థానాలు ఉండగా, బీజేపీ-ఏజీపీలు కలిసి 67 స్థానాలను కైవసం చేసుకుంటాయని, కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 57 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
 
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాత్రం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 18 స్థానాల్లో గెలిచి అధికారాన్ని సొంతం చేసుకుంటుందని సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్-డీఎంకే కూటమికి 12 వస్తాయని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు