రాజ్యసభలో కనీస మెజార్టీకి మూడు సీట్ల దూరంలో ఎన్డీయే కూటమి

ఠాగూర్

శుక్రవారం, 1 మార్చి 2024 (11:48 IST)
పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి సాధారణ మెజార్టీకి మూడు సీట్ల దూరంలో ఉంది. తాజాగా జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ 56 సీట్లకు గాను 30 స్థానాల్లో గెలుపొందింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం 97కి చేరింది. వంద సీట్లకు మరో మూడు స్థానాల దూరంలో ఆగిపోయింది. మరోవైపు, ఎన్డీయే కూటమి బలం 118 సీట్లకు పెరిగింది. 
 
మొత్తం 56 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 15 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాల్లోనూ బీజేపీ మరో రెండు స్థానాలను గెలుచుకోగలిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఇదే పనికి పాల్పడటంతో అక్కడ కూడా బీజేపీ మరో స్థానాన్ని అదనంగా కైవసం చేసుకుంది. 
 
కాగా, మొత్తం 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో సాధారణ మెజార్టీ 123 సీట్లు. అయితే, ప్రస్తుతం ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు సీట్లు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందినవి. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రపతి పాలన సాగుతుంది. మరో సీటు నామినేట్ విభాగంలో ఉంది. ఈ ఖాళీ ఐదు సీట్లను మినహాయిస్తే, ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్యా బలం 240కు తగ్గిపోయి కనీస మెజార్టీ కూడా 121కు పడిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీయే సాధారణ మెజార్టీ 118 సీట్లుగా ఉంది. అంటే సాధారణ మెజార్టీ 121కు మరో మూడు  సీట్ల దూరంలో ఆగిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు