ప్రియురాలిని వెతుక్కుంటూ వెళ్లాడు.. ఆమె రాను పొమ్మంది.. చివరికి ఏం చేశాడంటే?

బుధవారం, 11 ఆగస్టు 2021 (17:33 IST)
ప్రియురాలికి వివాహం జరిగినా వెతుక్కుంటూ వెళ్లాడు. తనతో రమ్మంది. రాను పొమ్మన్నాడు. అంతే ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో అతడితో పాటు వచ్చిన స్నేహితుడితో కలిసి ఆమెను హత్య చేసి అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన 21 ఏళ్ల మహిళకు అదే ప్రాంతంలోని రాజేంద్రన్‌ వర్మతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఈ దంపతులు కొన్నిరోజుల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. జీడిమెట్ల డివిజన్‌ వినాయకనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె నగరానికి వచ్చిన తర్వాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్‌ అనే యువకుడితో ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుతుండేది.
 
నువ్వు ఎక్కడ ఉంటున్నావ్.. అని అతడు ఆమెను ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదు. ఎట్టకేలకు ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్‌ మరో యువకుడితో కలిసి ధన్‌బాద్‌ నుంచి ఓ రోజు ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని ప్రియురాలు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. 
 
రాకేష్‌ ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. అలాగే మాట్లాడుతుండగా.. మధ్యలో తనతో ధన్‌బాద్‌ రావాలని పట్టుబట్డాడు. తన భర్తకు తెలిస్తే ఇద్దరినీ చంపేస్తాడంటూ ఆమె బదులిచ్చింది. అతడితో వెళ్లడానికి ఆమె ససేమిరా అంది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణను గమనిస్తున్న అదే ఇంటిలో ఉన్న మరో మహిళ ఆపేందుకు ప్రయత్నించగా.. అడ్డువస్తే నీ కుమారుడిని చంపేస్తానని రాకేష్‌ బెదిరించాడు.
 
అనంతరం రాకేష్‌తో ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన యువకుడు సదరు మహిళ కాళ్లను అదిమి పట్టుకున్నాడు. రాకేష్‌ దిండుతో ఆమె ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె భర్త రాజేంద్రన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు