వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
బలమైన నాయకత్వం వల్లే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా సురక్షితంగా బయటపడతారన్నారు. ఆర్థికంగా దేశానికి నష్టం వాటిల్లినప్పటికీ తిరిగి గాడిలో పెట్టవచ్చని, అదే మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కారణంగా కరోనావైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామన్నారు.
భౌతికదూరం పాటించకపోతే ఎంతటి విపత్తు ఏర్పడుతుందో తబ్లీగీజమాత్ కార్యక్రమం ద్వారా తేటతెల్లమైందని, ప్రజలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కచ్ఛితంగా భారతదేశం కరోనాపై విజయం సాధించితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.