ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతం.. నిర్భయ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2012లో నిర్భయపై కదిలే బస్సులో పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. కదిలే బస్సులో నలుగురు దుండగులు నిర్భయపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడటమే కాకుండా ఆమెను దారుణంగా హింసించి.. గాయపరిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన నిర్భయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఈ కేసులో ముందుగా ట్రయల్ కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించగా.. దీనిపై నిందితులు ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ట్రయల్ కోర్టు వేసిన ఉరి శిక్షను ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ క్రమంలో నిందితులు తమకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్‌పై శుక్రవారం వాదోపవాదనలు విన్న సుప్రీం కోర్టు.. ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
కాగా నిర్భయ కేసులో నిందితుడైన ఒకడు జైలులోనే ఆత్మహత్యకు పాల్పడగా, మరొకడు మైనర్ కావడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. దీంతో మిగిలిన నలుగురు నిందితులు ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్‌లకు ఉరిశిక్ష విధించారు. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మైనర్ అనే సాకుతో విడుదలైన మరో నిందితుడికి కూడా శిక్ష పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వారికి ఉరిశిక్ష పడటం ద్వారా తమకు న్యాయం లభించిందని వారు చెప్తున్నారు. ఇలాంటి కఠిన శిక్షల ద్వారా తప్పు చేయాలంటే భయపడతారని నిర్భయ తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇకపోతే.. డిసెంబర్ 16, 2012 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కదిలే బస్సులో గ్యాంగ్ రేప్‌కు గురై.. చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే.