ఢిల్లీలో ఉండబుద్ధి కావడం లేదు : నితిన్ గడ్కరీ

ఠాగూర్

బుధవారం, 9 జులై 2025 (10:49 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వస్తే రెండు మూడు రోజులకు మించి ఉండబుద్ధి కావడం లేదన్నారు. ఫరీదాబాద్- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ రోడ్డులో 'ఏక్ పెడ్ మా కే నామ్ 2.0' పేరుతో నిర్వహించిన మొక్కల పెంపకం డ్రైవ్‌లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'నేను రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఢిల్లీ ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటా. నేను ముందే రిటర్న్ టికెట్లను బుక్ చేసుకుంటా. ప్రజలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి. ఢిల్లీలో కాలుష్యం కారణంగా సాధారణ ప్రజల ఆయుర్దాయం తగ్గింది. 
 
వాహనాలకు వినియోగించే శిలాజ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలందరి ప్రధాన బాధ్యత. ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. పెద్దఎత్తున మొక్కల పెంపకం డ్రైవ్లను చేపట్టడంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ప్రభుత్వం రెండింటినీ చురుగ్గా అనుసరిస్తుంది' అని పేర్కొన్నారు.
 
పర్యావరణ స్థిరత్వం కోసం రోడ్డు నిర్మాణంలో వ్యర్థాలను ప్రభుత్వం సమర్థమంతంగా వినియోగిస్తుందన్నారు. రోడ్డు నిర్మాణంలో దాదాపు 80 లక్షల టన్నుల వ్యర్థాలను ఉపయోగిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. వెదురు తోటలు, దట్టమైన మొక్కల పెంపకం చేపట్టడంతో గ్రీన్ కారిడార్లను ఏర్పాటుచేయడంపై ఎన్.హెచ్.ఏ.ఐ దృష్టిసారించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. 2024-25లో 60 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని దాటి 67 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు