కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ ఇటీవలి కాలంలో సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని వాస్తవాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా, గత యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్థరణలు దేశ ప్రగతికి ఏ విధంగా దోహదపడుతున్నాయో కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
దేశ ఆర్థిక గతిని మార్చిన మేధావి మన్మోహన్ సింగ్ అని, దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని కొనియాడారు. "ట్యాక్స్ ఇండియా ఆన్లైన్ అవార్డు 2022" కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
దేశంలో గత 1991లో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. ఆయన చేపట్టిన చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మార్గంలో పయనించి, భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడిందని గడ్కరీ ప్రశంసించారు.