ఆదివారం సోషల్ మీడియా వేదికగా సండే సంవాద్ పేరుతో ఆయన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ వేడుకలతో తమను మెప్పించాలని ఏ మతమూ, ఏ దేవుడూ కోరుకోరని, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మతపరమైన పండుగలు, వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.
వైరస్ వ్యాప్తి ఇప్పట్లో పూర్తిగా సమసిపోయే అవకాశం లేదు కాబట్టి రాబోయే పండుగ సీజన్‌లో ఊరేగింపులు, మతపరమైన సభలకు దూరంగా ఉండాలని కోరారు. చలికాలంలో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉండడంతో తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా పూర్తిగా నిర్ధారించుకోకుండా ఇతరులతో పంచుకోవద్దన్నారు.
వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు వైరస్ బారినపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు. ఇందుకోసం కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు రాష్ట్రాలకు రూ.3 వేల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్న హర్షవర్ధన్.. త్వరలోనే దేశీయ కరోనా కిట్ ఫెలూడా పేపర్ స్ట్రిప్ టెస్ట్ అందుబాటులోకి వస్తుందని, ఇది అందుబాటులోకి వస్తే క్షణాల్లో కరోనా టెస్ట్ ఫలితం తెలుస్తుందని చెప్పుకొచ్చారు.