అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్.. తొలి డోస్ వేయించుకున్న ఆరోగ్య మంత్రి

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:40 IST)
అరబ్ దేశాల్లో ఒకటైన యూఏఈకి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ వ్యాక్సిన్ తొలి డోస్‌ను ఆ దేశ ఆరోగ్య మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ వేయించుకున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు అనేక దేశాలతోపాటు.. ఫార్మా కంపెనీలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ ఇపుడు మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశలోనే ఉన్నాయి. అయితే, రష్యా, యూఏఈలు మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తికాకముందే, ప్రజలకు పంపిణీ చేస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, యూఏఈలోని అబూదాబిలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశ ప్రారంభమైంది. ఈ వ్యాక్సిన్‌ను దేశంలోని 125 దేశాలకు చెందిన 31 వేల మందిపై ప్రయోగించి, ఫలితాలను వైద్యాధికారులు సమీక్షిస్తున్నారు. అలాగే, ఈ ప్రయోగం పూర్తికాకముందే వ్యాక్సిన్‌ను కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ యోధులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, తొలి విడత వ్యాక్సిన్ డోస్ దేశంలోకి అందుబాటులోకి వచ్చింది.
 
యూఏఈ ఆరోగ్య శాఖా మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్, ఈ వ్యాక్సిన్ తొలి డోస్‌ను తీసుకున్నారు. దీని ట్రయల్స్‌లో ఎలాంటి దుష్పరిణామాలూ సంభవించలేదని, ఈ కారణంగానే తాను టీకాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. దేశ ప్రజలను రక్షించడంలో తాము ముందుంటామని, ఈ వ్యాక్సిన్‌‌ను కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా ఇస్తామని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు