భార్య వేధింపుల వల్లే మద్యానికి బానిసనయ్యా.. విడాకులు ఇప్పించండి!
ఆదివారం, 31 మే 2020 (09:46 IST)
కేరళకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన చూపిన కారణం.. తన భార్య వేధింపుల వల్లే తాను మద్యానికి బానిసనయ్యానని అందువల్ల తనకు విడాకులు ఇప్పించాలంటూ అందులో ప్రాధేయపడ్డాడు. ఈ పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టివేయగా, హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన ఓ యువకుడు, యువతికి 2003లో పెళ్లి కాగా, వారికి ఓ అమ్మాయి జన్మించింది. రోజులు గడుస్తున్న కొద్దీ, భర్త, అత్త మామలతో ఆమెకు విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె, వేరు కాపురం పెట్టాలని వేధింపులు ప్రారంభించింది. దీనికి భర్త అంగీకరించలేదు.
దీంతో ఆమె 2011లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఎన్నిమార్లు ఇంటికి రావాలని కోరినా రాకపోవడంతో, విడాకులు ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టుకు ఎక్కాడు. ఆపై కోర్టులో విచారణ సాగగా, తనకు విడాకులు ఇవ్వాలన్న ఆలోచన లేదని, భర్తతో తనకు ఇబ్బంది లేదని, ఆయన తల్లితోనే తనకు సమస్యలు ఉన్నాయని కోర్టుకు చెప్పింది.
కాన్పు అయిన తర్వాత కుట్లు కూడా విప్పకుండానే పని చేయాలని ఒత్తిడి చేసిందని, నిత్యమూ హింసించేదని ఆరోపించింది. భర్తతో విడిగా ఉంటే తనకు సమస్యలు రాబోవని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో, విడాకులు ఇచ్చేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరిస్తూ, 2014లోనే కేసును కొట్టేసింది.
అయితే, ఆ వ్యక్తి మాత్రం ఎలాగైనా భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య నలుగురి ముందూ తిడుతూ ఉండేదని, భర్తగా తాను పనికిరానని అనేదని, తనతో సన్నిహితంగా ఉండదని, ఆమె కారణంగానే తాను మద్యానికి బానిసను అయ్యానని చెప్పుకున్నాడు. తన పిటిషన్ స్వీకరించి విడాకులు ఇప్పించాలన్నాడు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, భార్య చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. పైగా, భార్య ప్రవర్తనతో పిటిషనర్ సంతోషంగా లేడని తెలుస్తోందని, ఆయన భార్య కావాలనే గొడవలకు దిగినట్టుగా సాక్ష్యాలు చెబుతున్నాయని పేర్కొంది. కోడలితో పనులు చేయించడం, చేయమని చెప్పడం చాలా సాధారణమైన విషయమేనని, అంతమాత్రానికే వేరు కాపురం పెట్టాలని వేధించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ, ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.