రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలని పార్టీ అధిష్ఠానం భావించింది. కానీ, ఆ పదవిపై ఏమాత్రం ఇష్టంలేని అశోక్ గెహ్లాట్.. పెద్దల మాటకు తలాడించారు. కానీ, రాష్ట్రంలో తాను చేయదలచిన పనిని గుట్టు చప్పుడుకాకుండా చేశారు. తన వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. తద్వారా తాను చెప్పిన వ్యక్తినే తదుపరి సీఎం చేయాలని పరోక్షంగా కండిషన్ పెట్టారు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
అక్టోబరు 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనే తదుపరి కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడని ప్రచారం జరుగుతోంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతానని గెహ్లాట్ సోనియా, రాహుల్‌కు చెప్పగా వారు తిరస్కరించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములా ఫాలో కావాలని సూచించారు. అయితే కనీసం స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని గెహ్లాట్ అడిగారు.