సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్‌కు నమ్మనబంటుగా ఉండి, ఒకపుడు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమర్ సింగ్ ఇపుడు మరణశయ్యపై ఉన్నారు. ఈయన ఇపుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు క్షమాపణలు చెప్పారు. గతంలో అమితాబ్ కుటుంబం పట్ల అనుచితంగా ప్రవర్తించానని, దానికి ఇపుడు చింతిస్తున్నట్టు పేర్కొన్నాడు. పైగా, అమితాబ్ ఫ్యామిలీ తనను క్షమించాలని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
రాజ్యసభ మాజీ సభ్యుడైన అమర్ సింగ్.. తన హవా కొనసాగుతున్న సమయంలో అమితాబ్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బచ్చన్‌ది సిగ్గులేని కుటుంబంగా, వేషాలు వేసుకునే కుటుంబంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఇపుడు చింతిస్తున్నారు. ప్రస్తుతం మరణశయ్యపై ఉన్న అమర్‌సింగ్.. అమితాబ్ కుటుంబానికి ఓ వీడియో సందేశం పంపారు.
గతంలో అమితాబ్, ఆయన కుటుంబం పట్ల తాను చేసిన అతి ప్రవర్తనకు చింతిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం జీవన్మరణ సమస్యతో పోరాడుతున్న తాను అమితాబ్, ఆయన కుటుంబాన్ని క్షమాపణలు వేడుకుంటున్నట్టు తెలిపారు. అమితాబ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్టు అమర్‌సింగ్ పేర్కొన్నారు.