జల్లికట్టు సాహస క్రీడ తమిళ సంస్కృతిలో భభాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం ఢిల్లీలో మోడీతో భేటీ అయ్యారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధానికి కోరారు.
''జల్లికట్టు సంస్కృతిని, దాని ప్రాముఖ్యాన్ని అభినందిస్తున్నాం.. కానీ ఈ విషయం కోర్టులో ఉంది. జల్లికట్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు కేంద్రం మద్దతిస్తుంది. రాష్ట్రానికి ఏ రకమైన సహాయం కావాల్సి ఉన్నా కేంద్రం అందిస్తుంది. త్వరలోనే తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపుతున్నాం.'' అని ప్రధాని తన ట్వీట్లలో పేర్కొన్నారు.
అంతకుముందు.. ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని తొలగించేలా అత్యవసర ఆదేశాలు జారీ చేయాలని ఆయన మోడీని కోరారు. తొందరగా ఓ నిర్ణయం తీసుకోకపోతే తమిళనాడులో శాంతిభద్రల సమస్య తలెత్తే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం అన్నారు. మరోవైపు జల్లికట్టుకి మద్దతుగా చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద వరుసగా మూడోరోజు ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.