4 నెలల తర్వాత పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ- అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు..?

సోమవారం, 7 ఆగస్టు 2023 (13:31 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా మళ్లీ పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించడంతో ఎంపీగా మారారు. ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీకు ఊరట లభించింది. 
 
మోదీ ఇంటిపేరు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు జడ్జి రాహల్‌కు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాహుల్ గాంధీకి ఊరటను కల్పించింది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. అయితే, ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని రాహుల్ కు సుప్రీంకోర్టు హితవు పలికింది. 
 
మరోవైపు, పార్లమెంటుకు వచ్చిన రాహుల్ తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం పార్లమెంటు భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ఇండియా కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
 
మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం లోక్ సభలో ఈ తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఒక రోజు ముందు రాహుల్ పార్లమెంట్‌లో అడుగుపెట్టడం కీలక పరిణామంగా భావించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు