మొబైల్ కొంటే ఉల్లిపాయలు ఉచితం

సోమవారం, 9 డిశెంబరు 2019 (07:36 IST)
మొబైల్ ఫోన్లు కొంటే ఉచితంగా ఇచ్చే ఆఫర్లు ఏముంటాయి? మహా అయితే.. హెడ్‌ఫోన్లు, టెంపర్డ్ గ్లాస్, మెమొరీ కార్డులు. అయితే.. తంజావూరు జిల్లాలోని ఒక మొబైల్ షాపు యజమాని కస్టమర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు.
 
ఒక స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితం అని ఆఫర్ ప్రకటించారు. ఆశ్చర్యంగా ఉందా? 'ఉల్లిపాయలు ఉచితం' ఆఫర్‌ వల్ల తన అమ్మకాలు అమాంతం ఐదు రెట్లు పెరిగాయని సదరు షాపు యజమాని చెప్తున్నాడు. తమిళనాడులోని డెల్టా ప్రాంతమైన తంజావూరు జిల్లాలో పట్టుకొట్టాయ్ వాచ్‌టవర్ దగ్గర ఉంది ఎస్.టీ.ఆర్. మొబైల్ షాప్. ఈ దుకాణంలో గత రెండు రోజులుగా 'ఉచిత ఉల్లిపాయల' ఆఫర్ అందిస్తున్నారు.
 
''మా ఆవేదనను వ్యక్తం చేయటం మాత్రమే ఈ ఆఫర్ ఉద్దేశం'' అని యజమాని శ్రావణకుమార్ చెప్పారు. ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలకు ఎగబాకాయని ఆయన ఉటంకించారు. ''మెమొరీ కార్డు కూడా అదే ధరకు లభిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలకు.. మమొరీ కార్డు, హెడ్‌ఫోన్ల కన్నా ఉల్లిపాయలు ఎక్కువ అవసరం. అందుకే మేం ఈ ఆఫర్ ప్రారంభించాం'' అని వివరించారు.
 
ఇంతకుముందు సగటున రోజుకు రెండు లేదా మూడు ఫోన్లు అమ్మేవాళ్లు. ఉల్లిపాయల ఆఫర్‌తో ఈ షాపు వ్యాపారం ఐదు రెట్లు పెరిగింది. ''గడచిన రెండు రోజుల్లో 15 మొబైల్ ఫోన్ల కన్నా ఎక్కువ అమ్ముడయ్యాయి'' అని శ్రావణకుమార్ తెలిపారు.
 
ఉల్లి కిలో రూ.200
తరతరాలుగా జనాలను ఏడిపిస్తోన్న ఉల్లి.. దాని పరంపరను కొనసాగిస్తోంది. అయితే.. కాస్త ట్రెండ్ మార్చి కోసేటప్పుడే కాదు కొనేటప్పుడే ఏడిపించడం ప్రారంభించింది. ఖరీదు చూస్తేనే ఖంగుతినేలా చేస్తోంది. తమిళనాడు మధురైలో కిలో రూ. 200లకు చేరుకుని ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.

'5 కిలోలు కొనడానికి వచ్చే వినియోగదారులు.. కేవలం ఒక్క కేజీ కొనుక్కుని వెనుదిరుగుతున్నారు.' అంటున్నారు ఉల్లి వ్యాపారులు. ఇక వారానికి కేవలం ఉల్లి కొనుగోలు కోసం రూ.350 నుంచి 400 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు వినియోగదారులు. పంట దిగుబడి తగ్గిపోయి సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది ఉల్లి. గత కొద్ది రోజులుగా దేశంలో ఎటు చూసినా ఉల్లి లొల్లి వినిపిస్తూనే ఉంది.
 
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కష్టాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కోసం తిప్పలు తప్పడం లేదు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. ఒంగోలు రైతు బజారులో రాయితీ ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరారు.

తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో  మరింత రద్దీ అధికమైందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉల్లి కోసం కడపలో రైతు బజారు వద్ద ప్రజలు బారులు తీరారు. వృద్ధులు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పడిగాపులు కాశారు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు