సామాన్యుల యుద్ధం... పాకిస్థాన్ ముర్దాబాద్... నినాదాలు

గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:12 IST)
పుల్వామా ఉగ్రదాడులతో భారతదేశ ప్రజలు ఎంత అసహనంతో రగిలిపోతున్నారో చూస్తూనే ఉన్నాము... ఒకచోట కలెక్టర్ క్విట్ ఇండియా అంటే.. మరో చోట ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారనే కారణంతో కాశ్మీరీలకు నో ఎంట్రీ బోర్డులు పెట్టేస్తున్నారు... కాగా ఉగ్ర తండాలకు నెలవుగా మారి.. వారికి వత్తాసు పలుకుతున్న పాకిస్థాన్‌పై తీవ్ర వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు.
 
‘పాకిస్థాన్ ముర్దాబాద్ (పాకిస్థాన్ నశించాలి)’ నినాదాలతో ఒకరు హోరెత్తిస్తుంటే.. మరొకరు పాక్ జెండాలను, దిష్టిబొమ్మలను తగలబెడుతూ, తొక్కుతూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది చిన్నపాటి వ్యాపారులు మరింత వినూత్నంగా తమ నిరసనలు తెలుపుతూ ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అన్నవారికి అమ్మకాలపై డిస్కౌంట్‌లు కూడా ఇచ్చేస్తున్నారు. 
 
వివరాలలోకి వెళ్తే... ఈ బాటలోనే ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కి చెందిన ఓ చికెన్ తందూరీ అమ్మకందారు ‘‘పాకిస్థాన్‌ ఎన్నడూ మానవీయతకు విలువనివ్వదు.. అందుకే ప్రతి ఒక్కరూ మనసు లోతుల్లో నుంచి పాకిస్థాన్ ముర్దాబాద్’’ అని నినదించాలంటూ పిలుపునిస్తూ అలా నినదించిన వారికి ప్రతి కొనుగోలుపై 10 రూపాయిలు డిస్కౌంట్‌ని కూడా ప్రకటించాడు. 
 
ఇక ముంబైకి చెందిన ఒక చెప్పుల వ్యాపారి అయితే.. ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అన్నవారికి తక్కువ మొత్తానికే మూడు జతల చెప్పులు ఇస్తానంటూ నడిరోడ్డుపై అమ్మకాలు మొదలెట్టేసాడు. మరొక రెస్టారెంట్ యజమాని.. కస్టమర్లతో ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అనిపిస్తూ 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు. మొత్తం మీద ఇది అసహనంగా కాకుండా దేశ భక్తిగా మారితే చాలా బాగుండేదేమో...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు