భారత సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ విహారం, కూల్చేసిన భారత సైన్యం

శనివారం, 24 అక్టోబరు 2020 (18:28 IST)
భారత సరిదద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రమూకలు అక్రమంగా ప్రవేశిస్తూ కొన్ని విధ్వంసాలకు పాల్పడుతుండటం తరుచూ జరుగుతున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై భారత సైన్యం నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా తన సహాయ సహకారాలను పాకిస్థాన్ అందిస్తోంది.
 
ఆయుధాలను సైతం డ్రోన్ల ద్వారా అందిస్తూ ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నది. మరోవైపు భారత సైన్యం కదలికలను, స్థావరాల సమాచారాలను డ్రోన్ల సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్‌కు చెందిన పలు డ్రోన్లను భారత సైన్యం తుది ముట్టించింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకున్నది.
 
భారత నియంత్రణ రేఖ వద్ద ఏదో కదులుతున్నట్లు గమనించిన సైన్యం దాన్ని పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌గా గుర్తించారు. వెంటనే దాన్ని కూల్చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆ డ్రోన్‌ను కూల్చేశారు. పాక్‌ను అడ్డుకోవడానికి ఎప్పుడు భారత సైన్యం సిద్దంగా ఉంటుందని, చలికాలం కావడంతో మంచు ఎక్కువగా కురుస్తోందని, దీంతో పాక్ ఉగ్రవాదులను సరిహద్దు దాటించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆర్మీ అధికారులు తెలిపారు. పైగా ఈ డ్రోన్ చైనా కంపెనీ తయారు చేసిందనీ దీని పేరు మావిక్ 2 ప్రో అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు