భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.. కొడుకును అమ్మేశారు..

మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:38 IST)
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్ధలు... ఓ బాలుడి జీవితం అయోమయంలో పడింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మథిలి మండలం కియాంగ్ పంచాయతీ పరిధిలోని తేలగ బేజా గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
తొమ్మిదేళ్ల బాలుడు వాసుదేవ్‌ను కొనుక్కున్న అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం అతడిని పశువుల కాపలాకు పంపించేది. వెళ్లనని మారాం చేస్తే ఇష్టం వచ్చినట్టు కొడుతుండే వారు. అంతేకాదు, భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదు. వారి చిత్రహింసలు రోజు రోజుకు మరింత పెరగడంతో భరించలేకపోయిన బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని సలపదర్ అనే గ్రామానికి చేరుకున్నాడు.
 
వాసుదేవ్ కథ విన్న గ్రామస్తులు అతడిని తీసుకెళ్లి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. బాలుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త జయంతి వాసుదేవ్‌ను తన ఇంటికి తీసుకెళ్లింది. అయితే, విషయం తెలిసిన బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబం అతడిని విడిచిపెట్టాలంటూ జయంతికి ఫోన్ చేసి బెదిరించింది. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
స్పందించిన అధికారులు బాలుడి ఇష్ట ప్రకారమే ముందుకు వెళ్తామని, అతడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తామంటే పంపిస్తామని, లేదంటే చదువుకుంటానంటే చదివిస్తామని తెలిపారు. కాగా, బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నదీ తెలియరాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు