శుక్రవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం జరుగనుంది. లోక్‌సభలో సమరానికి అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరగనుంది.
ఈ నేపథ్యంలో కేంద్రంపై జరుగనున్న అవిశ్వాస తీర్మానాన్ని దేశ ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని, ఎంపీలు జాగ్రత్తగా వుండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టిన మోదీ, "ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ఎంతో ముఖ్యమైన రోజు. నిర్మాణాత్మకంగా, సమగ్రంగా, అవాంతరాలు లేకుండా చర్చ సాగాలని, అందుకు సహచర ఎంపీలంతా సహకరిస్తారని భావిస్తున్నాను. ప్రజలంతా మనల్ని చూస్తున్నారని గుర్తుంచుకోండి" అన్నారు. కాగా, అన్నాడీఎంకే, బిజూ జనతాదళ్, టీఆర్ఎస్ వంటి పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోనుండటం ఖాయంగా కనిపిస్తోంది.